ఆద్యాత్మిక విషయాలు

                                  భగవద్గీత ఒక రక్షణ కవచం

భగవద్గీత , మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు.


మనలో సహజమైన కాంతి భగవంతుడు ఇచ్చిన జ్ఞానరూపంలో ఉంది. కానీ మనం తెచ్చి పెట్టుకునే అజ్ఞాన అవరోధాలు ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా మనిషికే అట్లా ఉన్నాయి. మిగతా జీవరాశికి అట్లాంటివి లేవు, అవి ప్రకృతితో అనుకూలంగా ఉంటాయి, లభించినవాటితో సంతృప్తిగా ఉంటాయి. మనిషికి ఉన్న దానితో తృప్తి లేదు, ప్రక్కవాన్ని చూసి సహించలేడు. ఇంకితాన్ని పూర్తిగా వదిలి మానవుడు దుష్ప్రవృత్తికిలోనవుతున్నాడు అనేది మనం గమణిస్తున్నాం. మనిషి పెరిగి పోవాలి అని విజ్ఞానం పేరుతో ప్రకృతిని రకరకాలుగా విళయానికి చేరేట్టుగా చేస్తున్నాడో మనం గమణించవచ్చు. అందుకోసమే మనిషికి శాస్త్రం అవసరమైంది. మిగతా జంతువులకి శాస్త్రం అవసరం లేదు. మనిషికే క్రమశిక్షణ నేర్పడం అవసమైంది, మిగతా ప్రాణులు వాటంతట అవి జీవించగలవు, కానీ మనిషికే ఇతరులపై ఆధారపడి బ్రతకాల్సి ఉంటుంది. అందుకే తనలో తెచ్చుకోవల్సిన కాంతి అనేది కొంత ఉంటుంది. మనలోని అణగారిన కాంతిని పైకి తెచ్చుకోవల్సిన అవసరం ఉంది. ఒక కర్రలోనో, రాయిలోనో ఉన్న అగ్నిని రాపాడిస్తే పైకి వస్తుంది అగ్ని, అట్లానే కొన్ని పద్దతుల ద్వారా మనలో అణగారి ఉన్న జ్ఞానాన్ని పైకి తెచ్చుకొనే అవకాశం ఉంది. అలా ప్రతి వ్యక్తి ప్రకాశించగలగాలి.
  **********************************************************************************************************

మనం తెల్సుకోవాల్సినదేమిటి, చేయాల్సినదేమిటి అనేది భగవంతుడు ఉపదేశం చేసాడు. శాస్త్రం చెప్పింది కూడా దాన్నే. వేదం అని దానికి పేరు. శాస్త్రం నుండి నేరుగా మనం అర్థంచేసుకోవడం అంత సులభం కాదు. 

అందులో విషయాలు ఒకచోటనూ ఉండవు, అక్కడక్కడా వ్యాపించి ఉంటాయి. వాటి అర్థ నిర్ణయం చేసుకోవడానికి వీలుగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని ఒక సాకుగా పెట్టుకొని ఈ మానవ జాతికి ఉపదేశం చేసాడు. కలియుగం వస్తుంది కనక, ఈ కలియుగపు కష్టాలను మానవులు తట్టుకోలేరని, అందుకు తట్టుకొనే ఒక సాధనాన్ని మనకు రక్షణ కవచంగా అందించాడు భగవద్గీతను. దాన్ని మనం మన చీకట్లు తొలగించుకోవడాని వాడుకో గలగాలి. అందుకు తగ్గ సాధన చేయగలగాలి.


**********************************************************************************************************

ఒక వస్తువు యొక్క విలువ తెలియకుంటే ఆ వస్తువును మనం ఉపయోగించుకోలేం. ఉపయోగించుకోలేం సరికదా ఒక్కో సారిఎన్నో ఉపద్రవాలు కలిగించుకొనే ప్రమాధం ఉంది. ఒక అణ్వాయుధాన్ని ఒక సామాన్యుడి చేత ఉంచితే, దాన్ని వాడటం తెలియక ఇతరులకు ఉపద్రవం కలిగించే ప్రమాధం ఉంది. అట్లానే అతి విలువైన మానవ జన్మను వాడుకోవడం తెలియక మనం ఎన్నో కష్టాలకు నష్టాలకు గురి అవుతున్నాం. అందుకే భగవద్గీతను భగవంతుడు మనల్ని మనం బాగుచేసుకోవడానికి, మనకు విషయాల్ని తెలుపడానికి ఉపదేశం చేసాడు. ఒకరు మనల్ని వేలు ఎత్తి సరిదిద్దనవసరంలేకుండా, ఒక అద్దంలో చూసుకొని మనల్ని మనం సవరించుకోగలిగినట్లేభగవద్గీత ద్వారా మనల్ని మనమే సవ్యంగా దిద్దుకోవచ్చును. మంచిని పెంచేవి, మంచిని నింపే ఎన్నో సాధనాలు ఇచ్చాడు. అందరు భగవంతున్ని కోరుకుంటారు, కానీ భగవంతుడు ఎవర్ని కోరుకుంటాడో తానే చెప్పాడు. తాను మెచ్చే మానవుడు ఎట్లా ఉంటాడో కొన్ని సాధనాలు చెప్పాడు. మనం అట్లా కాగలగాలి, మాధవుడు మెచ్చే మానవులం కావాలి. మనం బాగుపడాలి అనేదే మనలోని కాంతి, అయితే మన చుట్టూ ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, ఒక దీపపు కాంతి చుట్టూ వీచే గాలివలె. దీపానికి రక్షణ కవచంగా చిమ్ని ఉంచినట్లే, మనకు ఒక రక్షణ కవచం కావాలి, అదే భగవద్గీతా కవచం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

భారతదేశము నా మాతృభూమి...." ప్రతిజ్ఞ "

శ్రీమద్భగవద్గీత

జీవితం