కరోనావైరస్: విద్యార్థుల చదువుల్ని సంక్షోభంలో పడేస్తోందా? ఆన్‌లైన్ తరగతుల ప్రభావం వారిపై ఎలా ఉంటోంది?
కరోనావైరస్:
విద్యార్థుల చదువుల్ని సంక్షోభంలో పడేస్తోందా? ఆన్‌లైన్ తరగతుల
ప్రభావం వారిపై ఎలా ఉంటోంది?
ఇక తెలుగు రాష్ట్రాల్లో
ప్రస్తుతానికి విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాకపోయినా... తాజా పరిస్థితులను
దృష్టిలో పెట్టుకొని కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం మరో 2 నెలలు
ఆలస్యం కావచ్చని ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో
చెప్పారు.
పదో తరగతి విద్యార్థుల
పరీక్షలు ఇంకా పూర్తి కాని నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్థుల
కోసం ప్రత్యేకంగా ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి.
ఏపీలో సప్తగిరి ఛానెల్
ద్వారా రోజూ రెండు గంటలు, అలాగే రేడియో, రెయిన్ బో
ఎఫ్ఎం ఛానెళ్ల ద్వారా పాఠాలను బోధిస్తూ విద్యార్థులను ఏదో విధంగా పరీక్షలకు సిద్ధం
చేసేందుకు ప్రయత్నిస్తోంది విద్యా శాఖ.
ఇక కార్పొరేట్ పాఠశాలల
విషయానికొస్తే... దాదాపు నెల రోజులుగా అన్ని పాఠాశాలలు పిల్లలకు ఆన్ లైన్ తరగతులు
నిర్వహిస్తున్నాయి.
పదో తరగతి మినహా
ప్రైమరీ, హైస్కూల్ విద్యార్థుల విషయానికొచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో ఇంకా వారికి
చదువులు ప్రారంభం కాలేదు. కానీ జాతీయ స్థాయిలో ముఖ్యంగా సీబీఎస్ఈ స్కూళ్లలో మాత్రం
చదువులు ప్రారంభమయ్యాయి.
ఏపీ ప్రభుత్వం
చెబుతున్న ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో విద్యా సంవత్సరం ప్రారంభమైతే..
అక్కడ కూడా జూన్ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ నెలల వరకు ఇదే
పరిస్థితి తప్పకపోవచ్చు.
ఆన్ లైన్ పాఠాలు, వీడియో క్లాసులు పిల్లల తలకెక్కుతాయా?
ఇంకా ఫైనల్ పరీక్షలు పూర్తి కాని పదో తరగతి
విద్యార్థుల దృష్టి మరలకుండా ఉండాలంటే ఇంతకన్నా మరో మార్గం లేదని అటు ప్రభుత్వాలు
చెబుతున్నాయి. ఇటు కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా అదే విషయాన్ని స్పష్టం
చేస్తున్నాయి. ఇక మిగిలిన తరగతుల విషయానికొస్తే లాక్ డౌన్ సమయంలో ఇంటికే పూర్తిగా
పరిమితమైన విద్యార్థులకు అంతో ఇంతో చదువుపై శ్రద్ధ కలిగేలా చేసేందుకే ఈ ప్రయత్నమని
చెబుతున్నాయి ప్రైవేటు విద్యాసంస్థలు.
“ఇప్పుడున్న లాక్ డౌన్ నేపథ్యంలో పూర్తిగా ఇళ్లకు
పరిమితమవుతున్నారు పిల్లలు. దీంతో టీవీలకు, మొబైల్ ఫోన్లకు
అతుక్కుపోతున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరో మూడు, నాలుగు
నెలల వరకు తరగతులు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే సూచనలు లేవు. అన్నిరోజుల పాటు
పిల్లలు పూర్తిగా చదువుకు దూరమైతే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాలి. అందుకే వారిని
ఏదో రకంగా కాసేపు చదువుపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించేందుకు వీడియో కాలింగ్
అప్లికేషన్ల ద్వారా బోధన సాగిస్తున్నాం. ప్రస్తుతానికి వారికి కొత్తగా ఎటువంటి
పాఠాలు చెప్పడం లేదు. పాతవే మరోసారి గుర్తు చేస్తూ వారి సందేహాలను తీర్చే ప్రయత్నం
చేస్తున్నాం” అని పేరు చెప్పడానికి ఇష్టపడని తెలుగు
రాష్ట్రాలకు చెందిన ఓ ప్రముఖ కార్పొరేట్ పాఠశాల జోనల్ ఇంఛార్జ్ చెప్పారు
ఇక సీబీఎస్ఈ
విషయానికొస్తే ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో సాధారణంగా ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. దీంతో ఈ ఏడాది కూడా దాదాపు
అన్ని పాఠశాలల్లో ఏప్రిల్ 1 నుంచే ఆన్ లైన్ తరగతుల్ని
ప్రారంభించారు.
వివిధ రకాల వీడియో
కాలింగ్ అప్లికేషన్లను ఉపయోగిస్తూ పాఠాలను బోధించే ప్రయత్నం చేస్తున్నారు.
నోట్సులు కూడా స్వయంగా ప్రిపేర్ చేసి వాట్సాప్ ద్వారా షేర్ చేస్తూ పిల్లలకు ఓ
రకంగా పాఠశాల జరుగుతోందన్న వాతావరణాన్ని కల్పిస్తున్నారు.
నిజానికి తెలుగు
రాష్ట్రాల్లో విద్యాసంవత్సరం సాధారణంగా ఏప్రిల్ 24 నాటికి ముగుస్తుంది. ఆ
తరువాత జూన్ 12 వరకు వేసవి సెలవులే. ఆ లెక్క ప్రకారం
ప్రస్తుతం వారు వేసవి సెలవుల్లో ఉన్నారు కనుక సమస్య లేదు.
ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇద్దరికీ కొత్తే!
నిజానికి ఆన్ లైన్ బోధనా విధానం
యూనివర్శిటీ స్థాయిలో దూర విద్యా విధానంలో అక్కడక్కడ ఉంది. పాఠశాల స్థాయికి
వచ్చేసరికి మాత్రం కేవలం డిజిటల్ క్లాస్ రూంల ఏర్పాటు ఉందే తప్ప... బోధన పూర్తిగా
క్లాస్ రూంలకు దూరంగా ఎప్పుడూ జరగలేదు. అందుకే ఇటు విద్యార్థులకు, అటు ఉపాధ్యాయులకు కూడా ఇది పూర్తిగా కొత్త విధానం అనే చెప్పాలి.
ఈ నేపథ్యంలో వీడియో కాలింగ్ అప్లికేషన్ల
వినియోగం, ఆన్ లైన్ ద్వారా పాఠాలను పిల్లలకు ఎలా బోధించాలి?
ఈ బోధనలో ఎలాంటి ఉపకరణాలను వినియోగించాలి? ఎటువంటి
పద్ధతుల్లో బోధించడం ద్వారా పిల్లల్ని ఆకట్టుకోగలం? వంటి
విషయాలను తాము కూడా కొత్తగా నేర్చుకుంటున్నామని సొసైటీ పాఠశాల ఉపాధ్యాయురాలు తెలిపారు.
“ఈ విధానం మాకు కూడా కొత్తే. ఉపయోగించే కొద్దీ
చాలా విషయాలు తెలుస్తున్నాయి. నేను కూడా విద్యార్థుల కోసం నోట్స్ ప్రిపేర్
చెయ్యడానికి గూగుల్ స్ప్రెడ్ షీట్స్, ఆన్ లైన్ బోర్డ్స్
తదితర టూల్స్ వినియోగం గురించి మా స్నేహితులను అడిగి తెలుసుకుంటున్నా. ఏదో విధంగా
పిల్లకు వీలైనంత సులభంగా పాఠాలు అర్థమయ్యేలా, వారికి
ఆకట్టుకునే విధంగా బోధించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నాం” అని ఆమె అన్నారు.
మొదట్లో కొద్ది కాలం పాటే ఈ పరిస్థితి
ఉంటుందని భావించామని... కానీ మున్ముందు కూడా ఇది కొనసాగే పరిస్థితి ఉండటంతో అందుకు
తగినట్టు ఉపాధ్యాయుల్ని, విద్యార్థుల్ని సిద్ధం చేస్తున్నామని ఆంధ్ర
ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన ప్రిన్సిపాల్ అన్నారు.
“మొదట్లో ఇది త్వరగా పూర్తవుతుందని పాఠాలు ఈ
విధానంలో మొదలుపెట్టాం. కానీ ఇప్పుడు, భవిష్యత్తులోనూ ఇదే
విధానాన్ని అవలంబించక తప్పని పరిస్థితి నెలకొంది. మొదట్లో పిల్లలు, తల్లిదండ్రుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ తరువాత తరువాత ఈ
పరిస్థితి కొనసాగక తప్పదని తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకున్నారు.
టీచర్ల విషయానికొస్తే ఇప్పటికే సాంకేతిక
పరిజ్ఞానంతో పరిచయం ఉన్నవారు వెంటనే ఈ విధానంలో ఒదిగిపోయారు. క్లాస్ రూం బోధనకు
మాత్రమే అలవాటు పడ్డవారు మాత్రం మొదట్లో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడిప్పుడే వాళ్లు
కూడా అలవాటు పడుతున్నారు” అని ఆమె చెప్పారు.
పిల్లల విషయానికొస్తే నిన్న మొన్నటి వరకు
గాడ్జెట్లకు దూరంగా ఉండాలని చెప్పిన తల్లిదండ్రులే కోరి వాటిని ఇచ్చి మరీ
చదివిస్తూ ఉండటం వారికి కాస్త కొత్త కొత్తగా ఉంటోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి