ప్రశ్నార్ధకమవుతున్న న్యాయవ్యవస్ధ


"కులము గల్గువాడు,గోత్రంబు గల్గువాడు,విద్యచేత విర్రవీగువాడు పసిడి గల్గువాని బానిసకొడుకులు" 
అన్నాడు వేమన్న!యెప్పుడు?కొన్ని శతాబ్దాల క్రితం - బహుశా సహస్రాబ్దాలు కూడా దాటిపోయి ఉండొచ్చు!కానీ కొన్ని నిజాలు యుగాల తరబడి మళ్ళీ మళ్ళీ రుజువులతో సహా జరుగుతూనే ఉంటాయి 


నేటి న్యాయ వ్యవస్థలో ఒక తీర్పు వెలువడ్డానికి, ఒక నేరం నిర్ధారించడానికి, కొన్నేళ్ల కాలం పడుతోంది. ఇందకోసం వందలాది పేజీల చార్జిషీట్, బోలెడు ఫైళ్లు, మరెన్నో సాక్ష్యాలు, ఇంకెన్నో రుజువులు..వీటన్నింటి ఆలంబనగా ఏళ్ల తరబడి వాదనలు..అవన్నీ ముగిసాక, కిందా మీదా పడి కింద కోర్టు తీర్పు చెబుతుంది. కానీ అంతలోనే పై కోర్టు, కింది కోర్టు తీర్పును పక్కన పెడుతుంది లేదా కొట్టి వేస్తుంది

కోర్టు కోర్టుకు తీర్పుమారితే, కోర్టుల్లో న్యాయం వున్నట్లా లేనట్లా?

మన న్యాయవ్యవస్థపై గౌరవం, భయం, భక్తీ అలాంటివి. అయితే రాను రాను వివిధ కేసుల్లో కోర్టులు ఇస్తున్న తీర్పులు చూస్తుంటే, ఈ భయమూ, భక్తి, గౌరవం ప్రశ్నార్థకమవుతున్నాయి అంటున్నారు అనుభవజ్ఞులైన కాలమిస్టులు. 18 ఏళ్లపాటు దిగువ కోర్టులో నలిగిన కేసు తీర్పు,  ఎనిమిది నెలల్లోనే ఎగువ కోర్టులో మారిపోవడం అంటే ఏమనుకోవాలి? మొన్నటికి మొన్న సల్మాన్ కేసులో తీర్పు వెలువడక ముందే ఆయన లాయర్, పైకోర్టులో అపీల్ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. జెయిలుకు వెళ్లకుండానే సల్మాన్ బెయిల్ తో ఇంటి ముఖం పట్టారు.

ఇప్పటి వరకు మనదేశంలో జనాలకు మిగిలిన ఏకైక విశ్వాసం మన న్యాయవ్యవస్థ మీదనే. రాజకీయ, అధికార, మీడియా వ్యవస్థలు కుళ్లి కూనారిల్లుతున్నాయి. వాటిలో వేటినైనే మేనేజ్ చేయడం అన్నది పెద్ద విషయమే కాదు. న్యాయ వ్యవస్థ అయినా తన అస్థిత్వాన్ని, గౌరవాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నదే సామాన్యుడి ఆశ, కోరిక..ఇటువంటి తీర్పులు వచ్చినపుడు అలాంటి ఆశలు గాలిలో దీపాల్లా కాస్త అల్లాడుతుంటాయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

భారతదేశము నా మాతృభూమి...." ప్రతిజ్ఞ "

శ్రీమద్భగవద్గీత

జీవితం